Ktr Tweet on New Secretariat Inauguration: హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తోన్న రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మరో రెండు మెగా ప్రాజెక్టుల గురించీ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ అమరవీరుల స్మారకం.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ట్విటర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.
Telangana New Secretariat Inauguration : కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఇప్పటికే ఆదేశించారు. దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, ఆయన పేరును మించిన పేరు లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిందని.. ఇదే విషయమై ప్రధానికి త్వరలోనే లేఖ రాస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని కొత్త పార్లమెంటు భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేశారు.