KTR Tweet Today: సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ మంత్రి ట్వీట్ చేశారు. అదనపు ఎక్సైజ్ ఛార్జీలు, సెస్‌లతో.. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆక్షేపించారు. ఆ కారణం వల్ల నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం.. అన్నీ పిరం... జగమంతా గరం గరం.. అంటూ ట్విటర్లో మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ ఛార్జీలు, సెస్‌లు తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం:మరోవైపు మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. మే 11, 12 తేదీల్లో లండన్‌లో జరగనున్న ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సు రెండవ ఎడిషన్‌కు.. గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీలో పాల్గొనాలని.. కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఏర్పాటు చేయనున్న విందుకు సైతం ఆయన ఆహ్వానం అందుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ అంతటా జరగనున్న భారత వారోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో.. బహుళ వ్యాపార, మీడియా, రాజకీయ నాయకులతో సహా 800 మందికి పైగా ప్రజలు హాజరుకానున్నారు.