Ktr On Central: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం రెట్టింపైందని కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ పెట్టింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది నిజమైతే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను దేశ ప్రజల ముందు పెట్టాలని ప్రధానిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మోదీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవసాయ రంగాభివృద్ది, రైతుల సంక్షేమం కోసం ఏ పథకాలు అమలు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపైందో వివరాలను బహిర్గతం చేయాలని మంత్రి కోరారు. ఏ రాష్ట్రానికి చెందిన రైతులకు లాభాల పంట పండి ఆదాయం డబుల్ అయిందో చెప్పాలన్నారు. మరోవైపు రైతుల ఆదాయానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ పెట్టిన పోస్టర్లో ఉన్న రైతు ఓ మోడల్ అని నెటిజన్లు పేర్కొన్నారు.