Cool Roof Policy Starts from Today in Telangana : ఇళ్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పురపాలక శాఖ.. చలువ పైకప్పు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఐదేళ్ల పాటు అమల్లో ఉండే... తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023-28ను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఈ విధానంపై రెండు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్న పురపాలక శాఖ.. ఎట్టకేలకు అమలుకు సిద్ధమైంది.
విద్యుత్ ఆదా అవుతుంది :హైదరాబాద్‌లో 100 చదరపు కిలోమీటర్ల మేర.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతంలో 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కూల్‌రూఫ్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చల్లదనం కోసం ఏసీల వినియోగం పెరిగి... కాలుష్య ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఏసీలు అమర్చుకోలేని సామాన్యులు వేడిమితో వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. చలువ పైకప్పులతో భవనాల లోపల వేడి తగ్గి, సౌకర్యవంతంగా ఉండటం సహా.. విద్యుత్ ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, ట్రిపుల్ ఐటీ, జీహెచ్‌ఎంసీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చలువ పైకప్పు విధానాన్ని తీసుకొస్తోంది.
ప్రైవేట్ గృహాలకు ఆ నిబంధన తప్పనిసరి కాదు :2019లో ముసాయిదా విడుదల చేసిన సర్కారు.. వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి తుదిరూపు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ, ఆస్కి కలిసి బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో ప్రయోగాత్మకంగా.. చలువ పైకప్పులను అమలుచేసి పనితీరును పరిశీలించాయి. వాణిజ్య భవనాలకు అనుమతి ప్రక్రియలోనే.. ఆ నిబంధనను అనుసంధానం చేయనున్నారు. అందుకోసం నిర్దేశిత ప్రమాణాల మేరకు... భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. ప్రభుత్వం బలహీనవర్గాల కోసం నిర్మించే నివాసాలకు కూల్‌రూఫ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తారు. ఇప్పటికే ఉన్న వాణిజ్య భవనాల్లోనూ చేయాల్సిన ఏర్పాట్లపై యజమానులను ప్రోత్సహిస్తారు. అయితే ప్రైవేట్ గృహాలకు ఆ నిబంధన తప్పనిసరి కాదన్న సర్కారు... కూల్‌రూఫ్ ప్రయోజనాలపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని నిర్ణయించింది.
కూల్ రూఫ్ విధానాన్ని రూపొందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ : తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28ని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. కూల్ రూఫ్ పాలసీ ద్వారా అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం, హీట్ స్ట్రెస్‌ని తగ్గించడం, ప్రక్రియలో CO2 ఉద్గారాలపై ఆదా చేయడం, శక్తిని ఆదా చేయడం లక్ష్యంగా ఇటువంటి విధానాన్ని రూపొందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అవుతుందని ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: