KTR Tele Conference on Crop Damage: పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో తెలంగాణ ప్రగతిని వివరించడంతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, దేశ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం.. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న తీరును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇంఛార్జీలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో ఆయన దిల్లీ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అకాల వర్షాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని.. నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. రైతు సోదరులకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి భరోసా ఇచ్చేలా, విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశంపైన దృష్టి సారించి వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని అన్నారు.
గ్రామస్థాయిలో ఉపాధి హామీతో పాటు పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్న కేటీఆర్.. పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన రూ.1,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని తెలిపారు.
వచ్చే నెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఇస్తున్న సందేశాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలని తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండుసార్లు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి 10 గ్రామాలకు నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన మేరకు ముందుకు పోవాలన్న ఆయన.. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత, వారితో ఉన్న అనుబంధాన్ని వివరించేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు.