KTR about electric vehicles : హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంత్రి సమక్షంలో ఫార్ములా- ఈ టీమ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం సరికొత్త శకానికి నాందిగా అభివర్ణించిన కేటీఆర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఈ -రేస్‌కు హోస్ట్‌గా నిలవనుందన్నారు. రాబోయే 90 రోజుల్లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని మంత్రి కేటీఆర్ సమక్షంలో నిర్వాహకులు ప్రకటించారు. సెక్రటేరియట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ఈ-రేసింగ్ కోర్టు అందుబాటులోకి రానుంది. నవంబర్ 22 నుంచి ఫిబ్రవరి మధ్య ఎప్పుడైనా ఈ-రేసింగ్ ఛాంపియన్‌షిప్ జరగొచ్చని ఫార్మూలా ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్ తరాలకు చక్కని వాతావరణం అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న మంత్రి.. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు. సీతారాంపూర్, దివిటిపల్లిలో ఈవీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు.
దశలవారీగా ఈ రేస్
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా-ఈ స్పోర్ట్స్ త్వరలో హైదరాబాద్‌కు రానుంది. ఫార్ములా వన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ రేస్ నిర్వహణకు క్యాండిడ్ హోస్ట్‌గా హైదరాబాద్ ఎంపికైంది. ఈమేరకు ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులు ప్రమోటర్ గ్రీన్ కో గ్రూపు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో లెటర్ ఆఫ్ ఇంటెండ్ను మార్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 18 నగరాల్లో దశలవారీగా ఫార్ములా ఈ-రేస్ జరుగుతుండగా.. గ్లోబల్‌గా 60 నగరాలతో పోటీపడి మరీ హైదరాబాద్ ఈ రేస్ నిర్వహణకు క్యాండిడ్ హోస్ట్‌గా ఎంపికవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ.. కర్బనఉద్గారాలను తగ్గించేందుకు పాటుపడుతున్న తెలంగాణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.