తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మణిహారమైన టీ-హబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధం అయిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇంక్యుబేటర్ నూతన భవనం నిర్మాణం పూర్తి కావొచ్చిందని ఆయన పేర్కొన్నారు. 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణమైన టీ-హబ్ నూతన భవనం 2 వేలకు పైగా అంకురాలకు కేంద్రంగా నిలవనుంది.
త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ భవనం దేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలో రెండో పెద్ద ఇంక్యుబేటర్గా టీ-హబ్ నిలవనుందని కేటీఆర్ సగర్వంగా ప్రకటించారు. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత బలపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మన్ననలు అందుకుంటున్న ఇంక్యుబేటర్లు
రాష్ట్రంలో అంకురాలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టీహబ్ (T-Hub), వీహబ్(V-Hub), డేటా సెంటర్, టీవర్క్స్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచింది. ఇన్నోవేషన్ ఎకోసిస్టంను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలోను టీహబ్ మాదిరి ఎం-హబ్ ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (Parliament Standing Committee) సైతం రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగమైన టీహబ్, తెలంగాణ డేటా సెంటర్ను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:TH-Coad App: టీహెచ్- కోడ్ యాప్ తోడుగా.. గమ్యస్థానం చేరడం ఇక సులువేగా..