KTR at the World Economic Forum conference: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో దావోస్‌లో నిర్వహించిన సదస్సులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. భారత దేశ చరిత్రలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణను పరిచయం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల వలన కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే సుమారు 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని కేటీఆర్ వివరించారు.
టీఎస్-ఐ పాస్ పారిశ్రామిక విధానం అనుమతుల ప్రక్రియ గురించి ప్రత్యేకంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను, ప్రాధాన్యతను గుర్తించిన వరల్డ్ ఎకానమిక్ ఫోరం నాల్గోవా పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోందని ఆయన ప్రకటించారు. ఈ కేంద్రం ముఖ్యంగా హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల పురోగతికి పనిచేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1000కి పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయన్న మంత్రి.. నోవార్టిస్, మెడ్ట్రానిక్, బేయర్, సనోఫీ, రోషే, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్ లలో 35% కేవలం తెలంగాణ నుంచే తయారు అవుతున్నాయని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను కూడా అనేక కంపెనీలు కలిగి ఉన్నాయని తెలిపారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగంలోనూ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి కంపెనీలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాద్‌లో కలిగి ఉన్నాయని ఆయన వివరించారు.
పెట్టుబడుల ప్రవాహం:దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు వెళ్లి కేటీఆర్ అక్కడ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ఇక్కడి సౌకర్యాలను వివరించి మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తున్నారు. ఇవాళ తాజాగా.. పెప్సికో పాటు మరో 2 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ సంస్థ పెప్సికో ప్రకటించింది. బ్యాటరీలు తయారు చేసే అలాక్స్ సంస్థ.. 750 కోట్లతో మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. లండన్ తరువాత తమ రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఇవీ చదవండి: