తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: మెరుగైన విధానాలతో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు

పెట్టుబడుల ఆకర్షణకు ఇతర రాష్ట్రాలతో పోటీపడుతున్నామని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. సింగపూర్‌ పెట్టుబడుల కోసం ప్రత్యేక హబ్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

KTR about foreign investments, minister ktr about policies in telangana
మంత్రి కేటీఆర్, సింగపూర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటి

By

Published : Jul 13, 2021, 1:36 PM IST

Updated : Jul 13, 2021, 2:42 PM IST

మెరుగైన విధానాలతో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ(IT), పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. సింగపూర్‌ పెట్టుబడుల కోసం ప్రత్యేక జోన్ లేదా హబ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ నేతృత్వంలోని ఆ దేశ ప్రతినిధి బృందం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసింది.

అద్భుతమైన విధానాలు

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ గురించి మంత్రి... వారికి పలు అంశాలను వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు టీఎస్‌ఐపాస్‌తో అనేక అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్ టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి రంగాల్లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే సింగపూర్‌ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రం పోటీ పడుతోందని మంత్రి తెలిపారు.

సహకారం అందిస్తాం

తెలంగాణలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని... ఈ అవకాశాలను తమ దేశ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన డీబీఎస్ వంటి కంపెనీలు... తమకు ఇక్కడ ఉన్న వాతావరణం గురించి సానుకూల ఫీడ్ బ్యాక్ అందించాయని తెలిపారు. సింగపూర్ కంపెనీలు ఐటీ, ఇన్నోవేషన్, ఐటీ అనుబంధ రంగాల్లో ఉన్న బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిస్తున్నాయని వాంగ్ తెలిపారు.

సానుకూల స్పందన

హైదరాబాద్‌లో ఉన్న టీహబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ఐటీ సిస్టం, ఇన్నోవేషన్ సిస్టం గురించిన సానుకూలతలు తెలుసునని సింగపూర్ హైకమిషనర్ అన్నారు. అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాల పట్ల ఆసక్తితో ఉన్నాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రతిపాదించిన సింగపూర్ పెట్టుబడులకు ప్రత్యేకంగా ఒక హబ్ ఏర్పాటు చేయడం ఒక గొప్ప ఆలోచన అని సిమోన్ వాంగ్ అన్నారు. గతంలో తాను వియత్నంలో పని చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం అక్కడ అనేక పెట్టుబడులను ఆకర్షించి, విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని సింగపూర్ హైకమిషనర్ చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 13, 2021, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details