అక్టోబర్ రెండో వారంలోగా బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి కావాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరలు, నేతన్నల కోసం తీసుకోవాల్సిన కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఉత్పత్తి దాదాపు పూర్తి కావొచ్చిందని, వాటి పంపిణీపై దృష్టి సారించినట్లు అధికారులు తెలియజేశారు.
బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే చీరల పంపిణీ ప్రారంభం కావాలన్న కేటీఆర్... అక్టోబర్ రెండో వారంలోగా పంపిణీ పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ జరిగేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన పొదుపు డబ్బులను గడువుకు ముందే తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు నేతన్నలకు ఎంతో మేలు చేకూర్చిందని మంత్రి అన్నారు.