హైదరాబాద్లో నాలాలు, చెరువుల రక్షణ, అభివృద్ధి కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. నాలాల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి జీహెచ్ఎంసీ మేయర్(ghmc mayor), డిప్యూటీ మేయర్, అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాలాలకు రిటైనింగ్ వాల్ నిర్మించి, వాటి బలోపేతానికి సంబంధించిన ప్రణాళికలు, అన్ని జోన్లలో త్వరలో ప్రారంభించనున్న నాలాల అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. త్వరలో చేపట్టనున్న నాలాల అభివృద్ధిపై జోనల్ కమిషనర్లు సమావేశంలో మంత్రికి వివరించారు. ఇప్పటికే ఆయా నాలాల్లో ఉన్న అడ్డంకులు, విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి రూపొందించిన నివేదికల వివరాలను మంత్రికి అందించారు.
ఎస్ఎన్డీపీతో సమన్వయం
ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని మంత్రి కేటీఆర్ వారికి సూచించారు. మొదటి దశలో చేపట్టే నాలాల విస్తరణతో పాటు ప్రతిసారి భారీ వర్షాలతో వరదకు కారణమవుతున్న బాటిల్ నెక్స్ ప్రాంతాలను గుర్తించి వాటిని విస్తరించే కార్యక్రమాన్ని కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దాలుగా నాలాలు కుంచించుకు పోయాయని కేటీఆర్ తెలిపారు. నాలాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో ఎన్నడూ లేని విధంగా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు.
నాలాల విస్తరణ అత్యవసరం