నాలాల పూడికతీత, విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను ముమ్మరంగా చేపట్టాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పూడికతీత పనులను అత్యంత ప్రాధాన్యత గల పనుల్లో చేరుస్తున్నామన్నారు. వీటి కోసం నిధులు విడుదల చేసేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధి, సామాన్య ప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాలాలలోని ఆక్రమణలను, అడ్డంకులను తొలగించాలని, అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపులో నిరాశ్రయులైన వారికి రెండు పడకల ఇళ్లు వెంటనే కేటాయించాలని ఆదేశించారు.
అభివృద్ధిపై సమీక్ష...
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అంతకముందు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాలా విస్తరణ, అడ్డంకుల తొలగింపు పనులను సంబంధించి ప్రభుత్వమే నిధులు పూర్తిగా మంజూరు చేస్తుందని వివరించారు.
పనులు ముమ్మరం...
ఈ విషయంలో స్వల్ప కాలిక పనులను పరిపాలన సంబంధిత అనుమతులను మంజూరు చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో లింక్ రోడ్ల నిర్మాణం, సీఆర్ఎంపీ పనుల పురోగతి ముమ్మరంగా సాగుతోందన్నారు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టుల భూసేకరణకై రూ. 2,800 కోట్ల విలువైన టీడీఆర్‌లను అందచేయడం దేశంలో ఎక్కాడా జరగలేదని... ఈ విషయంలో కమిషనర్ లోకేశ్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డిని మంత్రి అభినందించారు.