కరీంనగర్ పరిసరాల్లోని లోయర్ మానేరు దిగువన చేపట్టనున్న మానేరు రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్‌ను దేశంలోని ఇతర ప్రాజెక్టులకన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పురపాలక శాఖా మంత్రి కేటీరామారావు తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రణాళికలపై మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కేటీఆర్ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుతో సంబంధం ఉన్న నీటిపారుదల, రెవెన్యూ, పర్యాటక, పురపాలక, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మానేరు రివర్ ఫ్రంట్‌కు అవకాశం లభించిందని చెప్పారు.
అద్భుతమైన డిజైన్లతో అభివృద్ధి చేయాలి..
కేవలం సాగునీరు మాత్రమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పర్యాటకం వంటి రంగాల్లోనూ అద్భుత ప్రగతి సాధించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు రూపకల్పన చేశారని మంత్రి వివరించారు. మానేరు ఫ్రంట్ కోసం ఇప్పటికే 310 కోట్ల రూపాయలను కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో అభివృద్ధి చేయాలని... ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తయ్యాక హైదరాబాద్, వరంగల్, జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే ఐటీ టవర్ ద్వారా కరీంనగర్ పట్టణానికి కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని... రివర్ ఫ్రంట్ కార్యక్రమం పూర్తయ్యాక పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి శాఖతో పాటు రెవెన్యూశాఖ ప్రాజెక్టుకు అవసరమైన సహకారాన్ని అందించడంతో పాటు భూసేకరణ వంటి అంశాల్లో మరింత వేగం పెంచాలని కేటీఆర్ సూచించారు.