రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా పరిశ్రమల శాఖ కార్యాచరణను ముమ్మరం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడుల ప్రపోజల్స్, కంపెనీల విస్తరణ ప్రణాళికలు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు, నిర్మాణంలో ఉన్న పలు పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పనులు, అక్కడి కాలుష్య నియంత్రణ చర్యలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. హైదరాబాద్లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, కమిషనర్ మాణిక్ రాజ్, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలు లభించేలా..
తెలంగాణ రాష్ట్రానికి గత ఏడు సంవత్సరాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో నూతన పరిశ్రమల్లో తెలంగాణ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. పరిశ్రమల శాఖలో ఉన్న వివిధ విభాగాల వారీగా ఆయా డైరెక్టర్లతో రాష్ట్రానికి రానున్న పెట్టుబడి ప్రపోజల్స్, వాటి పురోగతిని చర్చించారు.