వర్షాలు, వరదలతో భాగ్యనగర ప్రజలు బెంబేలెత్తవద్దని, ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. ఆ దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నీళ్లు వెళ్లిపోయిన కాలనీలు, ఇళ్లలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ దిశగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ విభాగం ద్వారా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా శానిటైజేషన్ చేయాలని, రసాయనాలు పిచికారీ చేయాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్... మరి కొన్నాళ్ల పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేయాలని అధికారులకు చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కాలనీల్లో జీహెచ్ఎంసీ కేంద్రాలు, 104 వాహనాల ద్వారా తక్షణం వైద్య సాయం అందించాలని, ఇందుకు అవసరమైన వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరద ప్రభావం నుంచి బయటకు వచ్చిన ప్రజలు, తాగునీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని మంత్రి సూచించారు.