లాక్డౌన్ వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు... అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్డీపీ, స్లిప్, లింకు రోడ్ల పనులను పూర్తి చేసేందుకు ప్రస్తుత లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. నగరంలో పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జిలకు సంబంధించిన పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆయా పనులను పూర్తి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకారాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ఆర్వోబీ, ఆర్యూబీల ప్రగతిని దక్షిణ మధ్య రైల్వే అధికారులతో చర్చిoచారు. జీహెచ్ఎంసీ రోడ్డు పనులతో పాటు హైదరాబాద్ జలమండలికి సంబంధించిన కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా దక్షిణ మధ్య రైల్వేతో జతకూడి ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా సమావేశంలో చర్చించారు. రైల్వే శాఖ కూడా జీహెచ్ఎంసీ మాదిరి వేగంగా పనులను పూర్తిచేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా చూడాలని మంత్రి కోరారు.
పనుల్లో వేగం పెంచండి... రైల్వే శాఖకు కేటీఆర్ విజ్ఞప్తి - ktr
రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు సమన్వయంతో వ్యవహరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. నగర పరిధిలోని రోడ్డు విస్తరణ, లింక్ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చెoదుకు రైల్వే పరిధిలోని పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ అంశాలపై రైల్వే శాఖతో సమన్వయం కోసం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, ఇతర అధికారులతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రానున్న వర్షాకాలం లోపల సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రైల్వేకు సంబంధించిన పనులను పూర్తిచేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆర్వోబీ, ఆర్యూబీల పూర్తికి చేపట్టే పనులకు అవసరమైన అన్ని రకాల అనుమతులను ప్రాధాన్యతగా గుర్తించి జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే తమవైపు పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ప్రతిపాదిస్తున్న స్లిప్, లింక్ రోడ్లు విస్తరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై రైల్వే అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని బల్దియా అధికారులకు సూచించారు. దక్షిణ మధ్య రైల్వేతో సమన్వయం కోసం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే క్రాసింగ్స్ వద్ద ప్రమాదాల నివారణకు ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులను సూచించుటకు నిపుణుల కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం