KTR Review with GHMC officials on monsoon issues : వర్షాకాలం నేపథ్యంలో నగరంలో ఎదురయ్యే వరదలు, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన అంశాలపైన మంత్రి కేటీఆర్ చర్చించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో మెజార్టీ పనులు పూర్తయ్యాయని, గత సంవత్సరంతో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పుతుందని ఎస్‌ఎన్‌డీపీ విభాగం అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డివాటరింగ్ పంపులు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ఆదేశించారు.
నగర వ్యాప్తంగా ఉన్న చెరువులలో నీరు, పుల్ ట్యాంకు నిల్వలకు చేరకుండా వాటి నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే వర్షాకాల ప్రణాళికకు సంబంధించి గత కొంతకాలంగా పురపాలికలు అన్నీ ఏర్పాట్లను చేసుకుంటున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. జీహెచ్ఎంసీతోపాటు ఇతర పురపాలికల్లో నాలాల సేఫ్టీ ఆడిట్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. నగరంలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా చర్చించారు.
- Rains in Telangana : నైరుతిరాకతో.. రాష్ట్రవ్యాప్తంగా జోరు వర్షాలు.. తడిసిముద్దయిన భాగ్యనగరం
- KTR on IT Sector : బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్
ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని.. ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రతిరోజు వార్డు కార్యాలయ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కోరారు. వార్డు కార్యాలయ వ్యవస్థను నగర పౌరులు విస్తృతంగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు.