KTR Review Of Hyderabad City Traffic: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి.. కేటీఆర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో హైదరాబాద్ మహానగరంలోని పలు రహదారులపై వాహనాల రద్దీ గురించి చర్చించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో పాటు ట్రాఫిక్ డీసీపీలు సమీక్షలో పాల్గొని.. ట్రాఫిక్ రద్దీకి గల కారణాలను వివరించారు.
ప్రధాన రహదారులపైనే కాకుండా.. శివారు ప్రాంతాల్లోనూ తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న విషయాన్ని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు మంత్రి ముందు ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ, జలమండలి చేపడుతున్న పనుల వల్ల వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని పురపాలక మంత్రి కేటీఆర్ సూచించారు. సంబంధిత శాఖల అధికారులు తరచూ సమన్వయం చేసుకుంటూ.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. డివైడర్లు, యూటర్న్లు, సిగ్నళ్ల వ్యవస్థలో సమన్వయంతో పనిచేసే సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు విస్తరిస్తోందని, దానికి అనుగుణంగా రహదారులను తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పై వంతెనల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. రహదారుల ఆక్రమణలు తొలగించడంతో పాటు, వీధి వ్యాపారులను రహదారులపైకి రాకుండా చేస్తే సమస్య కొంత పరిష్కారమవుతుందని.. నిత్యం పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మూడు కమిషనరేట్లకు చెందిన ట్రాఫిక్ అధికారులు రూపొందించిన ప్రణాళికను సమీక్షలో కేటీఆర్కు వివరించారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది.