సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. తన దృష్టికి వచ్చే చాలా సమస్యలను పరిష్కరిస్తుంటారు. లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆయనకు విన్నవించుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. చాలా వరకు కేటీఆర్ తన కార్యాలయం ద్వారా ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎర్రగడ్డలో ఐదు నెలల పసికందు తాగేందుకు పాలు లేవంటూ పక్క ఇంటి వాళ్లు చేసిన విజ్ఞప్తికి అర్ధరాత్రి సమయమైనా తక్షణమే స్పందించి సహాయం అందించే ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డలో నివసించే ఓ కుటుంబం రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ ఇంట్లో ఐదు నెలల పసికందు ఉంది. అనారోగ్య కారణాలతో చిన్నారి తల్లి కొద్దిరోజుల క్రితం చనిపోయింది. తండ్రే ఆ పాప ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా దాదాపు నెలరోజులుగా ఉపాధి లేకపోవడంతో పాపకు పాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించడం కష్టంగా మారింది. పక్క ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకుని గురువారం రాత్రి ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.