Minister KTR Responded on Amit Shah Comments : ముఖ్యమంత్రి కేసీఆర్కు హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు మనసు రావడం లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందని అమిత్ షాకు గుర్తు చేసిన ఆయన.. అందుకు సంబంధించిన వార్తా కథనాలను ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ.. భారత్‌లో కలిసిపోయిన నాటి నుంచే సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 17ను విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని అడుగుతున్న వారు.. ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినోత్సవంగా ఎందుకు నిర్వహిస్తున్నామో ఆలోచించాలని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను, పోరాటాలను గౌరవ ప్రదంగా స్మరించుకోవడానికి బదులుగా.. గతించిపోయిన కాలానికి ఖైదీగా బంధీ కావడం మంచిది కాదన్నారు. వివాదాలను పక్కన పెట్టి, భవిష్యత్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ ట్విటర్‌లో కేంద్ర మంత్రికి హితవు పలికారు.