పురపాలకశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. గత ఏడాదిగా శాఖలోని వివిధ విభాగాల పనితీరు, పురోగతిని ఇందులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పురపాలికల్లో సమగ్రమైన మార్పు లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త పురపాలకచట్టంతో పట్టణాల్లో నూతన శకం ప్రారంభమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. చట్టం ప్రకారం స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లింపు మొదలు భవననిర్మాణ అనుమతుల వరకు అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు.
వార్డుస్థాయి కమిటీలు..
ప్రతి వార్డులో నాలుగు వార్డు స్థాయి కమిటీలను 15 మందితో ఏర్పాటు చేయాలని నిర్దేశించడం ద్వారా పురపాలనలో పౌరుల భాగసామ్యన్ని పెంచేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. పురపాలిక, నగరపాలికల సంఖ్యను 78 నుంచి 139కి పెంచామని, వాటన్నింటికీ జనవరిలో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణ స్థానికసంస్థలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించిందన్న మంత్రి... టీఎఫ్యూడీసీ ద్వారా 110 పట్టణ స్థానికసంస్థల్లో సుమారు రూ. 2 వేలకోట్ల విలువైన పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున పట్టణాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం మొదటిసారన్నారు.
పట్టణాల్లో రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టామని, హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. సీఆర్ఎంపీ, ఎస్సార్డీపీ వంటి రోడ్డు నిర్వహణ ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. హైదరాబాద్‌లో 690 కిలోమీటర్ల మేర రోడ్లను ఆరు ప్రధాన ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిపారు. దీర్ఘకాలిక నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పడం దేశంలోనే మొదటి సారని, ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని అన్నారు. నగరంలోని ప్రధాన మార్గాలను రద్దీ రహితంగా మార్చేందుకు మిస్సింగ్ రోడ్లు, స్లిప్ రోడ్లు, లింకు రోడ్ల అభివృద్ధి చేపట్టి... 38 ప్రధాన రోడ్డు విస్తరణ పనులు, జంక్షన్ల అభివృద్ధి కార్యక్రమాలు, బహుళఅంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు మొదలుపెటైనట్లు కేటీఆర్ వివరించారు.
పనుల పూర్తి..
లాక్డౌన్ సమయాన్ని అవకాశంగా వాడుకొని హైదరాబాద్ లాంటి పట్టణాల్లో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి ఇంజినీరింగ్ పనులను వేగంగా పూర్తి చేసిందని... 60 రోజుల సమయంలో సుమారు రూ. 2వేల కోట్ల విలువైన ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు.
మంత్రివర్గ ఆమోదం...
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తరహాలో భవన నిర్మాణ అనుమతులను ఆన్లైన్లో అందించే ప్రక్రియ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొనసాగుతోందని, మంత్రివర్గ ఆమోదం తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. టీడీఆర్ పాలసీకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా జీహెచ్ఎంసీలోని రోడ్డు విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు కావాల్సిన ఆస్తుల సేకరణ మరింత తేలికైందని... స్థానికసంస్థలపై ఆర్థిక భారం పడకుండా ఆస్తుల సేకరణ మరింత సులభమైందన్నారు. ఇప్పటివరకు 2019- 20 సంవత్సరానికి రూ. 250 కోట్ల విలువైన టీడీఆర్ సర్టిఫికెట్ల అమ్మకం జరిగిందని, పౌరులు తీసుకున్న సర్టిఫికెట్ల కొనుగోలుకు సంబంధించి టీడీఆర్ ఆన్లైన్ బ్యాంక్ శాఖ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పీపీపీ మెట్రో రైల్...
ప్రపంచంలోనే పొడవైన పీపీపీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ 69 కిలోమీటర్ల మేర పూర్తయి... దిల్లీ తర్వాత రెండో స్థానంలో అతి పొడవైన మెట్రో రైల్‌నెట్ వర్క్‌గా రూపొందిందని కేటీఆర్ చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సుమారు 4 లక్షల మంది రోజువారీ ప్రయాణంతో రద్దీ మెట్రోల్లో ఒకటిగా నిలిచిందన్నారు. పట్టణ పేదలకు ఆరోగ్యాన్ని అందించేందుకు ఇప్పటి వరకు ఉన్న 123 బస్తీ దవాఖానాలకు అదనంగా మరో 45 దవాఖానాలను ఒకేరోజు ప్రారంభించినట్లు కేటీఆర్ తెలిపారు. రానున్న సంవత్సర కాలంలో మొత్తం 350 బస్తీ దవాఖానాలను తెరిచేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పారు.
ఆటంకాలు లేకుండా...
పట్టణాల్లో తాగునీటికి ఆటంకాలు లేకుండా మంచినీటి సరఫరా చేశామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తోన్న 24 పట్టణ స్థానిక సంస్థలు, పద్దెనిమిది గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తూ... ఔటర్ రింగ్ రోడ్ లోపల రూ. 725 కోట్లతో తాగునీటి సరఫరా ప్రాజెక్టును పూర్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు పూర్తిస్థాయిలో తాగునీటి భరోసా కల్పించేలా 20 టీఎంసీల కేశవాపురం జలాశయ నిర్మాణ ప్రణాళికలను వేగవంతం చేశామని, రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయన్నారు.
ప్రణాళికబద్ధంగా...
కరోనా సంక్షోభం సందర్భంగా జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణా విభాగం మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేసిందని కేటీఆర్ స్పష్టం చేశారు. లాక్డౌన్లో మున్సిపల్ విభాగం... పారిశుద్ధ్యం, విపత్తు సహాయక నిర్వహణ, నీటి సరఫరా వంటి అంశాల విషయంలో 24 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా పని చేసిందని మంత్రి చెప్పారు. సుమారు లక్షా 25 వేల మందికి ఉచిత భోజనాన్ని అందించినట్లు తెలిపారు. వలస కార్మికుల క్యాంపుల్లో కావాల్సిన కనీస వసతుల నిర్వహణ, వారు సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు సహకారం అందించినట్లు మంత్రి వివరించారు.
ఇవీ చూడండి:పచ్చని మొక్కలతో ఆహ్లాదం పంచుతున్న పొదరిల్లు