భారతీయ జనతా పార్టీ... వాట్సాప్ ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని దిశా నిర్దేశం చేశారు. భాజపా అబద్ధాలకు విద్యావంతులు ప్రభావితం కాకుండా చూడాలని.. పార్టీ శ్రేణులకు తెలిపారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కాల్సిన దానికన్నా అదనంగా ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదన్న ఆయన... భాజపాకు ఓటడిగే అర్హత లేదన్నారు.
ప్రాజెక్టులకు నిధులు, ప్రత్యేక హోదాలు ఇవ్వలేదని.. ఇటీవల వైద్య కళాశాలల కేటాయింపుల్లోనూ మొండిచేయి చూపించిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను ప్రతీ ఒక్కరికి గుర్తు చేయాలని నేతలకు సూచించారు. కాంగ్రెస్‌కు చరిత్ర ఉంది కానీ.. భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలకు ప్రతీ ఎన్నిక అత్యంత కీలకమేనని పేర్కొన్నారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు సూచించారు.
అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి
ఉద్యోగాల భర్తీపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. దాన్ని బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా ఇప్పటికే లక్ష 33వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకమనేది కేవలం దుష్ప్రచారమేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో తెరాసది పేగుబంధమని.. ప్రత్యేక రాష్ట్రం కోసం వారందరూ తెరాసతో కలిసి పనిచేశారని కేటీఆర్ అన్నారు.