హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోన్న 1650 ఎంఎల్డీల మురుగునీటికి గాను అందులో కేవలం 46శాతం కేవలం 772 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. మొత్తం మురుగునీటిని శుద్ధి చేసే విషయమై ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు కేటీఆర్ తెలిపారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మురుగునీటి శుద్ధివ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎస్టీపీలకు అదనంగా 1260 ఎంఎల్డీ సామర్థ్యంతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(Sewerage Treatment Plants) నిర్మాణానికి కేబినెట్(CABINET) ఆమోదముద్ర వేసిందని కేటీఆర్ చెప్పారు. రూ. 3866 కోట్ల వ్యయంతో 31 ప్రాంతాల్లో ఎస్టీపీ(STP)ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
షా కన్సల్టెన్సీ(SHAH CONSULTANCY) నివేదిక ఆధారంగా రాబోయే పదేళ్ల పాటు అదనంగా ఉత్పత్తి అయ్యే మురుగునీరు శుద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు వాటి నిర్వహణ కూడా నిర్మాణదారులదే అన్న కేటీఆర్... హైదరాబాద్ ప్రజలకు శుభవార్త అందించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్లలో పనులు పూర్తి చేసి వందశాతం మురుగునీటిని శుద్ధి చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగేందుకు.. ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నాం. చెరువులు, కాలువల శుద్ధికోసం యత్నిస్తున్నాం. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకొని రూ. 5000 కోట్ల పైగా నిధులతో మురుగు నీరు శుద్ధి ప్లాంట్లు, మంచి నీటి సరఫరాకు రిజర్వాయర్లు, పైపులైన్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతితో జీవో విడుదల చేస్తున్నాం -కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి
పూర్తిగా వినియోగించేలా
శుద్ధి చేసిన మురుగునీటిని ప్రస్తుతం కేవలం 20 శాతం వరకు మాత్రమే వినియోగిస్తున్నామన్న కేటీఆర్... ఎక్కువ శాతం వినియోగించేలా కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖతో చర్చించి కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఓఆర్ఆర్ లోపలున్న అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలకు తాగునీటి సౌకర్యం కోసం రూ. 1200 కోట్లతో అదనపు పనులకు కూడా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 137 ఎంఎల్డీ సామర్థ్యంతో రిజర్వాయర్లు, 2100 కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేసి... రెండు లక్షల కొత్త మంచినీటి కనెక్షన్లు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. వరదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన ప్రాంతాల్లో ఎస్ఎన్డీపీ పనులు మొదట ప్రారంభించినట్లు తెలిపిన మంత్రి... నాలాలపై వేల సంఖ్యలో ఉన్న కబ్జాలను తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నాలాలపై కబ్జా ఉన్న వారిని ఇప్పటికే సిద్ధంగా ఉన్న రెండు పడకల గదుల ఇళ్లలోకి తరలించి వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నామని.. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.