KTR at Food Conclave 2023: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఫుడ్ కాంక్లేవ్ - 2023 ప్రారంభ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పశుసంవర్దక శాక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమానికి ఈ ఫుడ్ కాంక్లేవ్ పునాది అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం కేవలం తెలంగాణ కోసమే కాదని.. ప్రపంచంలో ఉన్న అన్ని అవసరాల కోసమని వివరించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎంతో ముఖ్యమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నేడు దేశానికే ఫుడ్ బౌల్‌గా తెలంగాణ మారిందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల్లో తెలంగాణ ముందంజలో ఉందన్న మంత్రి.. త్వరలోనే రాష్ట్రంలో ఆక్వా యూనివర్సిటీని తీసుకొస్తామని స్పష్టం చేశారు.
''ఒక పెద్ద కార్యక్రమానికి ఈ ఫుడ్ కాంక్లేవ్ పునాది. ఈ కార్యక్రమం కేవలం తెలంగాణ కోసం మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న అన్ని అవసరాల కోసం. ఫుడ్ ప్రాసెసింగ్ ఎంతో ముఖ్యం. నేడు దేశానికే ఫుడ్ బౌల్‌గా తెలంగాణ మారింది. వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల్లో తెలంగాణ ముందంజలో ఉంది. రాష్ట్రంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించేందుకు చూస్తున్నాం. త్వరలోనే తెలంగాణలో ఆక్వా యూనివర్సిటీని తీసుకొస్తాం.'' - కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి