KTR on Palle and Pattana Pragathi: రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పట్టణప్రగతి లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తే రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి జాతీయస్థాయి గుర్తింపు తప్పకుండా వస్తుందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్ విధానంలో కేటీఆర్ సమావేశమయ్యారు. పట్టణాల అభివృద్ధి, పట్టణప్రగతిపై వారికి దిశానిర్ధేశం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్న మంత్రి... దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా ఎలాంటి ఆటంకం లేకుండా స్థానిక సంస్థలకు నిరాటంకంగా నిధులు ఇస్తున్నట్లు చెప్పారు.
ఆ దిశగా ముందుకు సాగాలి..
minister ktr: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన పట్టణప్రగతి కార్యక్రమ లక్ష్యాలను అందుకునే దిశగా ముందుకు సాగాలని వారికి స్పష్టం చేశారు. పట్టణప్రగతి లక్ష్యాల పూర్తికి ప్రయత్నిస్తే అన్ని పట్టణాలకు జాతీయ గుర్తింపు వస్తుందన్న కేటీఆర్... ఇప్పటికే పట్టణప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, అమలు పరచిన పురపాలికలకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కిన విషయాన్ని ప్రస్తావించారు. పట్టణాల పురోగతి కోసం ప్రత్యేకంగా టీయూఎఫ్ఐడీసీ సంస్థను ఏర్పాటు చేసి పట్టణప్రగతి నిధులకు అదనంగా పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీంతో మౌలికవసతుల కల్పన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. స్థానికసంస్థల పరిధిలో ఉన్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, పచ్చదనం నిర్వహణ వంటి కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన బాధ్యతను పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు.
ఇలాంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు..