Minister KTR on DK Sivakumar Letter : ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లు ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. రాజకీయ వేడిని అమాంతం పెంచేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారాయి. రాష్ట్రంలో కేసీఆర్ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లోని పరిశ్రమలు బెంగళూరుకు తరలివెళ్తాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు.
కంపెనీలను బెంగళూరుకు తరలించాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Sivakumar Letter) ఇటీవల ఫాక్స్‌కాన్ సంస్థకు లేఖ రాశారని కేటీఆర్ తెలిపారు. త్వరలో తెలంగాణలో తమ ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని.. తరలింపునకు ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవని ఆ లేఖలో పేర్కొన్నారని ప్రస్తావించారు. కేసీఆర్‌పై దాడికి షర్మిలతో పాటు చాలా మంది ఒకటవుతున్నారని విమర్శించారు. సింహం సింగిల్‌గానే వస్తుందని.. ఈ ఎన్నికలకు కేసీఆర్ సింగిల్‌గానే వెళతారని స్పష్టం చేశారు.
KTR Says Vote for KCR Again : కేసీఆర్ మళ్లీ ప్రజలనే నమ్ముకుంటారని.. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్ బరాబర్ ఓట్లడుగుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ఈ మేరకు స్పందించారు. అక్కడక్కడ ఏదైనా అసంతృప్తి ఉన్నా.. ఓట్లు మాత్రం బీఆర్‌ఎస్‌కే వేయాలని కేటీఆర్ కోరారు. న్యాయవాదుల డిమాండ్ల పరిష్కారానికి తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.