లాయర్ వామన్‌రావు దంపతుల హత్యకేసులో నిందితులెవరున్నా... కఠినంగా శిక్షించేలా సీఎం ఆదేశించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్వరాష్ట్రం వచ్చిన నాటి నుంచి తెరాస ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో ఉక్కుపాదం మోపుతూనే ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా అతిత్వరలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణభవన్‌లో న్యాయవాదులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, న్యాయవాదులు హాజరయ్యారు.
తెలంగాణ వ్యక్తిని ఏజీ చేయాలని గతంలో పలుమార్లు కోరాం. వైఎస్‌ఆర్ హయాంలో కోరితే నమ్మకమైన వ్యక్తి కావాలన్నారు. జైపాల్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వ్యక్తిని ఏజీ చేయాలని కోరాం. రామకృష్ణారెడ్డిని ఏజీగా నియమించాలని కోరాం. ఎందరిని కోరినా తెలంగాణ వ్యక్తిని ఏజీ చేయలేదు. తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు రావట్లేదని పలుమార్లు తేటతెల్లమైంది. తెలంగాణ వచ్చాక రామకృష్ణారెడ్డిని ఏజీగా నియమించారు.