ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రతినిధుల బృందం ప్యారిస్ పర్యటన(Ktr France tour) కొనసాగుతోంది. రెండో రోజు మంత్రి కేటీఆర్ బృందం ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్ అయిన మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో భేటీ అయింది. తెలంగాణలో పెట్టబడి అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను పేర్కొన్నారు. ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్-ఎఫ్‌లో కేటీఆర్ బృందం పర్యటించింది. టీహబ్, వీ-హబ్, టీ వర్క్స్ వంటి తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ సంస్థలతో సహకారంపై చర్చించింది. స్టేషన్ - ఎఫ్ ప్యారిస్‌లోని ఓ ప్రత్యేకమైన క్యాంపస్, కమ్యూనిటీ, వెయ్యి స్టార్టప్‌ల కేంద్రంగా ఉంది. రైల్వే డిపోగా ఉన్న ఈ కేంద్రాన్ని ఇంక్యుబేటర్‌గా మార్పుచేశారు.
తెలంగాణలో అవకాశాలపై వివరణ
ఏడీపీ ఛైర్మన్, సీఈవో అగస్టిన్ డీ రోమనెట్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఏడీపీ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టింది. భారతదేశంలో విమానయాన రంగం వేగవంతమైన వృద్ధి దశలో ఉందని... మహమ్మారి సంబంధిత ఆంక్షలు సడలించడంతో పరిశ్రమ కొత్త ఎత్తులను స్కేల్ చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా ఉందన్నారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్‌ను తెలంగాణ ప్రతినిధుల బృందం(Ktr France tour) కలిసింది. సనోఫీ త్వరలో హైదరాబాద్ ఫెసిలిటీ నుంచి సిక్స్ ఇన్‌వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు.