పట్ణణాల్లో అభివృద్ధి మరింత ప్రణాళికాబద్ధంగా జరిగేలా.. స్థానిక పరిస్థితులు, ఆయా పట్టణాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని.. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్(minister ktr) అధికారులకు స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న పట్టణీకరణ మేరకు పట్టణాభివృద్ధి(Urban development) దిశగా నిరంతరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ ఆస్కిలో విస్తృతస్థాయి మేథోమధన సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులతో సమావేశంలో చర్చించారు. ఆరు గంటలపాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై మున్సిపల్ శాఖ విభాగాల అధిపతులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
లక్ష్యాలకు అనుగుణంగా
పట్టణాల ప్రణాళిక రూపకల్పన సమయంలో భవిష్యత్తు అవసరాలకు సంబంధించి పెద్దపీట వేయాలని పట్టణాభివృద్ధి నిపుణులు కేటీఆర్‌కు సూచించారు. పట్టణాల అవసరాలు గతంలో కన్నా భిన్నంగా ఉన్నాయని... దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పట్టణాల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందన్న కేటీఆర్... కేవలం స్వల్పకాలిక లక్ష్యాలే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో పట్టణాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ నగరంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనేక మౌలిక వసతుల కార్యక్రమాలు, ప్రాజెక్టులను చేపట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.