KTR Meeting with Ministers and MLAs: ఈ నెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత.. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జన సమీకరణ చేయాలని గ్రేటర్ నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 10,000 మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు కేటీఆర్ సూచించారు.
ఈ నెల 13న గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన.. సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జిలుగా నియమించనున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు ఇన్‌ఛార్జీలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోని జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున.. అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు తమిళనాడు, ఝూర్ఖండ్ సీఎంలు స్టాలిన్, హేమంత్ సొరేన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, తదితర నేతలు కూడా హాజరు కానున్నారు.