డిజిటల్ సాంకేతికతలో తెలంగాణ అద్భుతాలు సాధిస్తోందని, పరిపాలన, ప్రజాసేవల్లో దానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. కృత్రిమమేధ, ఓపెన్‌డేటా, బ్లాక్‌చైన్ వంటి నవీన సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తోందని తెలిపారు. నాలుగు రోజుల ఫ్రాన్స్ పర్యటన కోసం బుధవారం ఆ దేశ రాజధాని పారిస్ చేరుకున్న ఆయన.. తొలిరోజే అక్కడి ప్రభుత్వ డిజిటల్ వ్యవహారాల రాయబారి హెన్రీ వెర్డియర్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కేఎం ప్రఫుల్లచంద్ర శర్మ, తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, డిజిటల్ మీడియా, వైమానిక విభాగం సంచాలకులు కొణతం దిలీప్, ప్రవీణ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణలో డిజిటల్ సాంకేతికత, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ డిజిటల్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల గురించి వెల్లడించారు. రాష్ట్రంలో ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, ఓపెన్ డేటా విధానాన్ని కేటీఆర్ వివరించారు. ఆవిర్భవించిన అనతికాలంలో తెలంగాణ గొప్ప సాంకేతిక ప్రగతిని సాధించడం అభినందనీయమని ఈ సందర్భంగా వెర్డియర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్, వెర్డియర్‌లు డిజిటలీకరణ, ఓపెన్‌డేటా, ఆవిష్కరణల రంగాల్లో ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారానికి అంగీకరించారు. తెలంగాణ అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఆ దేశంలోని అంకుర సంస్థలకు తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపార, వాణిజ్య అవకాశాల కల్పనకు నిర్ణయించారు.
నేడు మరిన్ని భేటీలు