తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR on Oil farm: ఆయిల్​ పామ్​పై రైతులు దృష్టి సారించండి: కేటీఆర్

రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాలతో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మళ్లాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. సిరిసిల్లలో(sircilla) ఆయిల్​ పామ్(oil farm)​ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్​జీవీ కంపెనీ(fgv company) ప్రతినిధులతో ప్రగతిభవన్​లో మంత్రి సమావేశమయ్యారు.

By

Published : Sep 22, 2021, 5:04 PM IST

KTR on Oil farm
ఎఫ్​జీవీ కంపెనీ ప్రతినిధులతో ప్రగతిభవన్​లో మంత్రి

రాష్ట్రంలో ఆయిల్​ పామ్(oil farm) వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్(ktr) కోరారు. సిరిసిల్లలో(sircilla) ఆయిల్​ పామ్​ ఫ్యాక్టరీ స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్​జీవీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్​ పామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు.

తెలంగాణలో అవకాశాలు పుష్కలం

ఆయిల్​ పామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని కంపెనీకి చెందిన సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం భారీ ఎత్తున ఆయిల్​ పామ్ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. అంతే కాకుండా వేలాది మందికి ఆయిల్​ పామ్ ఫ్యాక్టరీలలో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఆయిల్​ పామ్ పంటకు ప్రసిద్ధి చెందిన మలేషియాలో తమ కంపెనీ చేస్తున్న ఆయిల్​ ఫామ్​ పంట సాగు, ప్రాసెసింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు పర్యటించాలని కేటీఆర్​ను ఆహ్వానించారు.

తప్పకుండా పర్యటిస్తా

కంపెనీ ప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ మలేషియాలో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తప్పకుండా పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఆయిల్​ పామ్ పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లతో పాటు మరికొన్ని చోట్ల రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. సిరిసిల్లతో పాటు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆయిల్​ పామ్ మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్‌ పంట సాగు ప్రోత్సహించాలని గతంలోనే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు.. మొదటి ఏడాది రూ.26వేలు, తరువాతి రెండేళ్లు ఏటా రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద రాయితీగా అందించాలని నిర్ణయం తీసుకుంది. అటవీ శాఖ, అటవీ అభివృద్ధి సంస్థతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఆయిల్ పామ్ మొక్కలు, నర్సరీలు పెంచాలని సూచించింది. ఈ పంట సాగు విధానం గురించి మరింతగా తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం.. కోస్టారికా, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో పర్యటించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: ఆయిల్ పామ్‌ సాగుకు ప్రోత్సాహం.. రైతులకు రాయితీ

ABOUT THE AUTHOR

...view details