సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొవిడ్ కేసుల పేరుతో దారులను ఇష్టారీతిన మూసివేయటం వల్ల లక్షలాది మంది నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.
లోకల్ మిలటరీ అథారిటీ స్థానిక కంటోన్మెంట్ బోర్డుకి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ యాక్ట్‌లో ఉన్న సెక్షన్ 258కి ఇది పూర్తి విరుద్ధమని కేటీఆర్ గుర్తు చేశారు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్డు మూసివేసే ప్రక్రియ ఉండాలన్నారు. అయితే ఇష్టారీతిన అత్యంత చిన్న చిన్న కారణాలు చూపి పదే పదే రోడ్ల మూసివేస్తున్నారని ఆరోపించారు.
సికింద్రాబాద్ లోకల్ మిలటరీ అథారిటీ పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కొవిడ్ కేసుల పేరు చెప్పి అధికారులు మూసివేశారని కేటీఆర్ పేర్కొన్నారు. పదే పదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగరవాసులు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు చాలా తగ్గాయని, అయినప్పటికీ కొవిడ్ పేరు చెప్పి తాజాగా మరోసారి రోడ్ల మూసివేతకు పాల్పడడం అత్యంత బాధాకరమని అన్నారు.
స్థానిక మిలటరీ అధికారుల పరిధిలో ఉన్న రోడ్లపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని.. ఆ సమావేశంలో ఇందుకు సూచనప్రాయంగా అంగీకరించారని కేటీఆర్ తెలిపారు. ఆ దిశగా రక్షణ శాఖ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని అన్నారు. రోడ్లు మూసివేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి నగరవాసులకు ఊరట కల్పించాలని కేటీఆర్ కోరారు.
ఇదీ చూడండి: 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ: సీఎం కేసీఆర్