తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ.. ఆ ఓట్లు తిరిగి చేర్చాలంటూ విజ్ఞప్తి - కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు తాజా వార్తలు

KTR on Contonment Voters Issue : కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో తొలిగించిన ఓట్ల విషయమై.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. తొలిగించిన 35 వేల మంది ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించాలని, తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఓట్లు తొలగించటం ప్రజల హక్కులను హరించడమే అన్నారు.

KTR letter to Union Defence Minister Rajnath Singh
KTR letter to Union Defence Minister Rajnath Singh

By

Published : Mar 15, 2023, 9:41 PM IST

KTR on Contonment Voters Issue : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35 వేల ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని... ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు ఆయన లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న 35 వేల మంది పౌరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని లేఖలో పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో రక్షణశాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న అర్థం లేని కారణంతో, అర్హత కలిగిన వారిని కూడా ఓట్ల జాబితా నుంచి తొలగించారని అన్నారు.

రాజ్యాంగ వ్యతిరేకంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం : దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 75ఏళ్లుగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాల హక్కులకు భంగం కలిగించేలా, అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరిగిందని ఆయన ఆరోపించారు. ఓటర్లకు కానీ, వారి కుటుంబాలకు కానీ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని మంత్రి ఆక్షేపించారు. దేశ పౌరులుగా... తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసముంటున్న వీరి ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా, వారికి రాజ్యాంగం కలిగించిన ఓటుహక్కును దూరం చేయడం అక్రమమని అభిప్రాయపడ్డారు. కంటోన్మెంట్ బోర్డుకు, విద్యుత్ శాఖకు, నీటిసరఫరా శాఖకు బాధ్యత కలిగిన పౌరులుగా దశాబ్దాలుగా వీరు పన్నులు, బిల్లులు చెల్లిస్తున్నారన్న ఆయన... గతంలోనూ కంటోన్మెంట్ బోర్డు, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.

ఓట్లు తొలగించటం ప్రజల హక్కులను హరించడమే :కానీ, ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు వీరి హక్కులను హరించేలా ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిందని కేటీఆర్ మండిపడ్డారు. అక్రమంగా నివాసం ఉంటున్నారని కంటోన్మెంట్ బోర్డు చెప్పిన కారణం సహేతుకంగా లేదన్న మంత్రి కేటీఆర్... ఇప్పటి దాకా దేశంలోని ఏ న్యాయస్థానం కానీ, స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కానీ వీరు ఆక్రమంగా నివసిస్తున్నారని అధికారికంగా తేల్చలేదని అన్నారు. తొలగించిన ఓటర్లను అక్రమంగా నివాసం ఉంటున్నారని రుజువు చేయకుండానే, నేరుగా వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అన్యాయమని కేటీఆర్ ఆక్షేపించారు. 2018లో 1,91,849 ఓటర్లు ఉంటే ఇవాళ ఆ సంఖ్య 1,32,722 కు తగ్గడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చేపడుతున్న ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో దేశంలో ఎక్కడా లేని విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్​లో గత ఐదేళ్లుగా ఓటర్ల జాబితాలోని పౌరుల సంఖ్య పెరగకుండా, తగ్గిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 35 వేల మంది ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించాలని, తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details