KTR letter to modi: చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోస్టుకార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డులో కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ.. సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాశానని మంత్రి చెప్పుకొచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైనే పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనేనని ధ్వజమెత్తారు.