తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Letter To Nirmala: వాటిని అమ్మడమంటే.. రాష్ట్రాల హక్కులు హరించడమే: కేటీఆర్ - ktr letter on psu

KTR Letter To Nirmala: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహస్యం చేసేలా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు.

Ktr Letter To Nirmala
ఐటీశాఖ మంత్రి కేటీఆర్

By

Published : Jun 19, 2022, 3:36 PM IST

KTR Letter To Nirmala: ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్​కు లేఖ రాశారు. రూ.40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను మోదీ ప్రభుత్వం అమ్ముతోందని.. ఆరు కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు గతంలో సూమారు 7200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని లేఖలో వివరించారు. నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే లాంటి ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్​ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు గతంలో సూమారు 7200 ఎకరాల భూమి కేటాయించామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ధర ప్రకారం కనీసం 5వేల కోట్ల రూపాయలకు పైగా విలువ ఉంటుందని..బహిరంగ మార్కెట్ లో రూ.40వేల కోట్లు ఉంటుందని పర్కొన్నారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలని లేదంటే...ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలన్నారు.

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా భూములను సద్వినియోగం చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రమే బిజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను భాజపా ప్రభుత్వం అడ్డికి పావుసేరుకు అమ్ముతోందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతో పాటు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పీఎస్​యూల అమ్మకంపైన పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. తెలంగాణలోని అయా కంపెనీల ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకుని బయటపడతామంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఆ సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే.. అదే ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.

ఇవీ చదవండి:

Army Major Shivakiran: 'ఆర్మీలోని వేరే క్యాడర్‌లో అగ్నిపత్‌ వంటి విధానాలు ఉన్నాయా?'

తనయుడితో కలిసి పదో తరగతి పరీక్ష.. తండ్రి పాస్​.. కొడుకు ఫెయిల్​

ABOUT THE AUTHOR

...view details