1200 కోట్లతో ఓఆర్‌ఆర్ పరిధిలో తాగునీటి సరఫరా: కేటీఆర్ ktr lays foundation stone for ORR Phase-2 project: ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలకు హైదరాబాద్‌లో భాగంగా భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్-2 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.... కార్పొరేషన్‌లో విలీనమైన అన్ని గ్రామాలకు నీరు అందిస్తామని వెల్లడించారు.
దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉందన్న కేటీఆర్... హైదరాబాద్‌కు మాత్రమే ఎన్నో కోణాల్లో అనుకూలతలు ఉన్నాయన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు ఇప్పటికే నగరంతో కలిసిపోయాయని స్పష్టం చేశారు. రూ.1200 కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్ పరిధి ఆవాసాలకు నీటి సరఫరా అందిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలకే నీటి సరఫరా కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి తాగునీరు కూడా సరఫరా చేస్తామని అన్నారు. కొండపోచమ్మసాగర్ నీటితో గండిపేట చెరువును నింపాలనేది సీఎం ఆలోచన అని వివరించారు. హైదరాబాద్‌కు వాటర్ ప్లస్ సిటీ అవార్డు వచ్చిందని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. మూడు నెలల్లోనే పనులు పూర్తి చేసి మంచినీరు అందిస్తామని పేర్కొన్నారు.
'కార్పొరేషన్‌లో విలీనమైన అన్ని గ్రామాలకు నీరు అందిస్తాం. ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలకు హైదరాబాద్‌లో భాగంగా భావిస్తున్నాం. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు ఇప్పటికే నగరంతో కలిసిపోయాయి. రూ.1200 కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్ పరిధి ఆవాసాలకు నీటి సరఫరా చేయనున్నాం.'
- కేటీఆర్, మంత్రి
వచ్చే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పురపాలక మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలు దేశంలోని మహానగరాల్లో వేటికి లేవని చెప్పారు. మహానగర విస్తరణ దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. భాగ్యనగర శివారు ప్రాంతాల తాగునీటి సమస్యలు త్వరలో తీరనున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది. 2051 సంవత్సరం ప్రగతి దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నుంచే తాగు నీటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. ఔటర్‌రింగ్ రోడ్డు పరిధి గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు నీరందించే రెండోదశ పనులకు హైదరాబాద్ మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో పురపాకల శాఖ మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. జల మండలి ఆధ్వర్వంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నగర శివారు ప్రాంతాల్లో 978 కాలనీలతోపాటు ఆరు లక్షల మంది ప్రజల దాహర్తి తీరనుంది.
'నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణానికి 12 వందల కోట్లు వ్యయం చేయనున్నాం. 75 నూతన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నాం. కొత్తగా 2వేల864 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తాం. ప్రస్తుతం తలసరి నీటి సరఫరా 90 నుంచి 100 లీటర్ల సరఫరా జరుగుతుండగా.. 150 లీటర్లు పెంచుతాం. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో ఇళ్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నాం. 2లక్షల9వేల870 నీటి కనెక్షన్లు కొత్తగా ఇచ్చే అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలకు హైదరాబాద్‌లో భాగంగా భావిస్తున్నాం.'
- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
ఇదీ చూడండి: కరోనానా.. సాధారణ జ్వరమా.. గుర్తించడం ఎలా?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!