Minister KTR Launched Amazon Air in Hyderabad: వినియోగదారులు ఆర్డరు చేసిన వస్తువులను మరింత వేగంగా అందజేసేందుకు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా.. సొంతంగా సరకు రవాణా విమానాలను ప్రారంభించింది. ‘అమెజాన్ ఎయిర్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ విమాన సేవలకు సోమవారం శ్రీకారం చుట్టింది. శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఐరోపా దేశాల తర్వాత సరకుల కోసం విమాన సేవలను హైదరాబాద్ నుంచి ప్రారంభించడం హర్షణీయమన్నారు. తన ఆహ్వానం మేరకు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన సంస్థ, హైదరాబాద్‌పై ఎంతో ప్రేమ చూపిస్తోందని ప్రశంసించారు. ఇ-కామర్స్ సంస్థలకు ప్రముఖ కేంద్రంగా హైదరాబాద్ మారుతోందని, వైమానిక సరకు రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను కార్గో హబ్‌గా చేసేందుకు, అదనపు ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు అమెజాన్ ఎయిర్ తోడ్పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని అమెజాన్ క్యాంపస్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలవడం గర్వకారణమని అన్నారు. అమెజాన్ వెబ్ సర్వీస్ రాష్ట్రంలో డేటా కేంద్రాల కోసం రూ.36,600 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు.
అమెజాన్ కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఆర్డర్ చేసిన వస్తువు, రేపటికి డెలివరీ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వారి అవసరాలను తీర్చేందుకు అమెజాన్ ఎయిర్ తోడ్పడుతుంది’ అని పేర్కొన్నారు. వినియోగదారులకు సరకులు రవాణా చేసేందుకు ప్రత్యేక విమానాలను వినియోగించుకుంటున్న మొదటి ఇ-కామర్స్ సంస్థ తమదేనని తెలిపారు. దేశంలోని 11 లక్షల మంది విక్రేతలకు దీనివల్ల మద్దతు లభిస్తుందన్నారు. ఇప్పటివరకు ఇతర విమానయాన సంస్థలపై ఆధారపడ్డామని, ఇక నుంచి సొంత విమానాల్లో సరకు రవాణా జరుగుతుందని తెలిపారు.