పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) పేర్కొన్నారు. హైదరాబాద్ ఫతేనగర్ సీవరేజ్ ట్రిట్‌మెంట్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు. 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రూ.317 కోట్లను మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్న కేటీఆర్... భాగ్యనగరానికి భారీగా వలస వస్తున్నారని స్పష్టం చేశారు. ప్రతిఏటా హైదరాబాద్‌కు లక్షలమంది ప్రజలు వస్తున్నారని... జనాభాకు తగ్గట్లుగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో రోజుకు 1,950 ఎంఎల్‌డీల మురుగునీటి ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. 94 శాతం నీరు గ్రావిటీ ద్వారా మూసీలోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా మురుగునీటి శుద్ధి అవుతుందని స్పష్టం చేశారు. మురుగునీటిని మంచినీటిగా మార్చి బయటకు వదులుతున్నామన్నారు. మురుగునీటిని శుద్ధి చేయకుంటే ప్రమాదం ఏర్పడే అవకాశముందని చెప్పారు.
నగరంలో దాదాపు 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రూ.1280 కోట్లతో 17 ఎస్‌టీపీలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. 17 ఎస్‌టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి అవుతుందని స్పష్టం చేశారు. ఫతేనగర్‌లోనాలాలపైనే మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాలాల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో మంచినీరు, మురుగునీరు పైప్‌లైన్లు కలిసిపోయాయని గుర్తు చేశారు. మంచినీటిలో మురుగునీరు కలవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.