తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Wishes on TS Formation Day : 'తెలంగాణకు ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం'

KTR Wishes To Telangana People On Formation Day : 2024 ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండరని అంచనా వేస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. సరికొత్త రాష్ట్రమైన తెలంగాణలో అపార ప్రగతి జరిగినప్పుడు దేశమంతటా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. తెలంగాణ కేవలం పదేళ్లలోనే వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిందన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Minister KTR Wishes Telangana Formation Day
Minister KTR Wishes Telangana Formation Day

By

Published : Jun 2, 2023, 10:02 AM IST

KTR Wishes on Telangana Decade Celebrations :పోరాట యోధుడే పాలకుడై సాధించిన తెలంగాణ సగర్వంగా దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం పదేళ్లలోనే వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిందన్నారు. ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్..రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.

Minister KTR Chitchat With ETV Bharat :దశాబ్దాలుగా పరిపాలించిన పార్టీలు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను బీఆర్ఎస్ తొమ్మిదేళ్లలోనే చేసి చూపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలని.. ప్రజారవాణాను మెరుగుపరచాలని.. మెట్రో రైలు 250 కిలోమీటర్లకు విస్తరించాలని.. నాలాలు, వరద నీటి కాల్వలను చక్కదిద్దాలని వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తాము 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దమ్ముంటే వాళ్ల సీఎం అభ్యర్థిని ప్రకటించమని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చేస్తుండటంతో పనిలేక.. ప్రతిపక్షాల నాయకులు నోటికొచ్చినట్లు వాగుతూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రధానిని అధికారం నుంచి సాగనంపాల్సిందేనని.. అందుకు ఆయన అన్ని విధాలా అర్హులేనని మంత్రి కేటీఆర్ అన్నారు

KTR Fire On PM Modi :ఒక వ్యక్తిపై విద్వేషంతో కాకుండా.. కేంద్రంలో బీజేపీ ఎలా విఫలమైందో చెప్పేందుకు.. అలాగే మెరుగైన పరిపాలన కోసం ఏం చేద్దామో చెప్పేందుకు దేశంలోని ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి నమూనా ఎలా ఉండాలో తెలంగాణ దేశం ముందు ఉంచిందని చెప్పారు. ఓఆర్​ఆర్ టెండరును జాతీయ రహదారుల నిబంధనల మేరకు ఇచ్చామని తెలిపారు. దీనికిగానూ ప్రతిపక్ష నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అందుకే హెచ్‌ఎండీఏ పరువు నష్టం దావా వేసిందని స్పష్టం చేశారు. 'సచివాలయం కడితే అవినీతి అంటారు.. ప్రతిదానికి విమర్శలే.. ఇకపై ఆధారాలు లేకుండా ఏవైనా ఆరోపణలు చేస్తే.. పరువు నష్టం దావాలు వేయాలి' అని నిర్ణయించామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఎంత పండిస్తే అంత కొంటున్నాం:తాము అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు దీటైన పథకాలు ఉన్నాయేమో కాంగ్రెస్‌ను చెప్పమని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు 12 క్వింటాళ్లకు మించి ధాన్యం కొనటం లేదన్న కేటీఆర్.. తెలంగాణలో ఎంత పండిస్తే అంతా కొంటున్నామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెప్పమని ప్రశ్నించారు. తెలంగాణ సంక్షేమ పథకాలను ఆచరిస్తుంటే ఇతర రాష్ట్రాలు కూడా అవి అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రైతుబంధు ప్రవేశపెట్టారన్నారు. టీ-హబ్‌ మాదిరిగా ఎం-హబ్‌ పెడుతున్నారని తెలిపారు. తమతో పోటీపడే పరిస్థితి ప్రతిపక్షాలకు లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో బీజేపీ సోషల్‌ మీడియాలోనే ఉందని.. అధికారంలోకి వస్తామనే కాంగ్రెస్‌ భ్రమల్లో ఉంటే వాళ్ల ఇష్టమని అన్నారు. వైఎస్ షర్మిల, కేఏ పాల్‌ కూడా అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీది గెలుపు కాదని.. అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల తిరస్కారమన్నారు. అక్కడ ప్రధానమంత్రి, హోం మంత్రి, ఎనిమిది రాష్ట్రాల సీఎంలు విస్తృతంగా ప్రచారం చేసినా వారికి విజయం దక్కలేదని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్‌కూ ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఇటీవలే అక్కడ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు.

వైఫల్యాలకు మోదీనే కారణం:ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వంటగ్యాస్‌ ధరలు పెరగటానికి మోదీనే కారణమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రూపాయి విలువ ఇంతగా క్షీణించడం ఆయన వైఫల్యమేనని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు ఘోర తప్పిదమన్న ఆయన.. దానికి అప్పట్లో మేమూ మద్దతిచ్చామన్నారు. అందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నామని చెప్పారు. రాహుల్‌గాంధీ రాజకీయ పార్టీ కన్నా స్వచ్ఛంద సంస్థను నడుపుకోవటం మంచిదని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే సైద్ధాంతిక కొట్లాటలుంటాయి.. పారిపోతానంటే ఎలా? ఎన్నికల సమయంలో ఆయన గుజరాత్‌లో ఎందుకు పాదయాత్ర చేయలేదని ప్రశ్నించారు. దేశంలో సమర్థ ప్రధాని ఎవరంటే.. ముందువరుసలో పీవీ నరసింహారావు పేరే చెబుతానని తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదు:ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానావకాశాలు ఉండాలని మంత్రి కేటీఆర్.. పునర్విభజనలోనూ అలానే ఉండాలన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయటంతో జనాభా తగ్గిందని ఆరోపించారు. జనాభా నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే తమ వాదనని వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం పరిపాలన పరంగా ఒక దేశమంత ఉంటుందని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో జనాభా ఎక్కువని.. జనాభా ప్రకారం సీట్లు నిర్ణయిస్తామంటే దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగేవాటి కన్నా ఎక్కువగా ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే పెరుగుతాయన్నారు. దేశ ప్రగతికి దోహదపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదని.. లోక్‌సభ సీట్ల విషయంలో హేతుబద్ధీకరణ ఉండాలన్నది తమ వాదనని తెలిపారు. సీట్ల పెంపుపై ఆరోగ్యవంతమైన చర్చ జరగటం కోసమే మాట్లాడుతున్నానని.. దీనికి నూతన విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చిన కేంద్రం రాజ్యాంగాన్ని సవరించలేదా? అని ప్రశ్నించారు.

నీళ్లు, నిధులు, నియామకాల్లో మెరుగ్గా..:నీళ్లు, నిధులు, నియామకాలు.. అనే నినాదంతో ఉద్యమించిన బీఆర్​ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించామన్నారు. సాగునీటి లభ్యతను పెంచాం.. అలాగే సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. గత ఏడాది కన్నా అదనంగా 12 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామని గుర్తుచేశారు. రూ.3.08 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. సంపద సృష్టించి.. అన్ని వర్గాలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో 1.32 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామని.. మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ప్రైవేటు రంగంలో ప్రత్యక్షంగా 24 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ 26 వేల ఉద్యోగాలిస్తే తొమ్మిదేళ్లలో అంతకంటే 800 శాతం అధికంగా ఇచ్చామని ధీమా వ్యక్తం చేశారు. వైద్యవిద్యలో దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకిన విషయాన్ని నీతి ఆయోగే చెప్పిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details