తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఒక్క కేసీఆర్ సార్​ ఉంటే చాలు.. మాకు అదే 'పది'వేలు' - Untimely Rains Govt Actions

KTR Tweet on Crop Loss Compensation: దేశంలో ఒక్క తెలంగాణలోనే అన్నదాతకు పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. అందుకే మన రైతన్న మనోగతం 'ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు.. మాకు అదే పది వేలు' అని అంటున్నారని తెలిపారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.పది వేలు ఇస్తామన్న సీఎం కేసీఆర్​ ప్రకటనపై స్పందించిన కేటీఆర్​.. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

KTR
KTR

By

Published : Mar 24, 2023, 1:35 PM IST

KTR Tweet on Crop Loss Compensation: బీఆర్​ఎస్​ మినహా వేరే పార్టీలను పొరపాటున నమ్మినా.. తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి పోతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యానించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అంటేనే.. భారత' రైతు' సమితి అని ఆయన కొనియాడారు.

ఒక్క తెలంగాణలోనే అన్నదాతకు పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అందుకే మన రైతన్న మనోగతం 'ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు.. మాకు అదే పదివేలు' అని ట్వీట్ చేశారు. 'వేరేటోళ్లను పొరపాటున నమ్మినా.. తెలంగాణ మళ్లీ వెనక్కి వందేళ్లు' అని మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

మరోవైపు అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిన ఖమ్మం, వరంగల్​, మహబూబాబాద్​, కరీంనగర్​ జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పర్యటించారు. నష్టపోయిన పంటలను పరిశీలించిన ఆయన.. రైతులను పరామర్శించారు. పంట నష్టంతో కుదేలయిన మొక్కజొన్న, మిరప రైతులు ఆరుగాలం శ్రమించి.. అధిక పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకుంటూ వస్తే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు సీఎం వద్ద మొరపెట్టుకున్నారు.

వారిని ఓదార్చిన కేసీఆర్.. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం​ ప్రకటించారు. సుమారు 2.28 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తన దగ్గరకు లెక్కలు వచ్చాయని కేసీఆర్​ తెలిపారు. వర్షాల వల్ల అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

కేంద్రానికి నివేదక ఇవ్వం: పంట నష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇంతకుముందు పంపిన వాటికే.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఈ మేరకు పంట నష్ట తీవ్రత అంచనా వేసి.. తక్షణమే సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేసీఆర్​ ఆదేశించారు. దీనికోసం ఓ జీవో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్​ శాంతి కుమారి, అధికారులు, మంత్రులకు పలు సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details