KTR inaugurated Tukaram Railway Gate Under Bridge: వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం ద్వారా హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పటి వరకు రూ.6 వేల కోట్ల వ్యయంతో పనులను పూర్తి చేసినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.72 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్‌లో నిర్మించిన తుకారాం రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ నగరంగా అభివృద్ధి చేసేందుకు నగరవాసులు సహకరించాలని మంత్రి కోరారు.
ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి..
శతాబ్ద కాలం నుంచి సికింద్రాబాద్ తుకారాం గేట్ వద్ద ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ప్రజలకు రవాణా ఇక్కట్లు తప్పాయని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే అండర్‌పాసులు, పై వంతెనలు, ఆర్ఓబీలను చేపట్టడం ద్వారా ప్రజల ట్రాఫిక్ సమస్యలను అధిగమించినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో రైల్వే లైన్ ఉన్నందున.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిపినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను ఇప్పటికే చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
"ఎన్నో దశాబ్దాల నుంచి తీవ్రమైన సమస్యగా ఉన్న తుకారం రైల్వే గేట్‌ను.. అండర్ వంతెనతో పరిష్కరించుకున్నాం. సికింద్రాబాద్ పరిధిలో నూతన కాలేజీల ఏర్పాటు, రోడ్ల విస్తరణ పనులు, ఎన్నో సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ పనులు.. ఉపసభాపతి పద్మారావు నేతృత్వంలో జరుగుతున్నాయి. సికింద్రాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఆర్వోబీలు, ఆర్యూబీలపై.. రైల్వే శాఖ అధికారులతో సమావేశమయ్యాం. నగరంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ నాయకత్వంలో కృషి చేస్తున్నాం." -కేటీఆర్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
ఉద్యమ సమయంలోనూ..
తుకారాం రైల్వే గేట్ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో వంతెన నిర్మాణం పూర్తయిందని హర్షం వ్యక్తం చేసారు. ఉద్యమ కాలంలో కూడా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఈ అండర్ బ్రిడ్జితో మల్కాజిగిరి, మారేడ్‌పల్లి, మెట్టుగూడ, లాలాపేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గిస్తుందని చెప్పారు. అంతే కాకుండా మౌలాలి, మల్కాజిగిరి, తార్నాక, సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుందని వెల్లడించారు. దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. దళిత అభ్యున్నతి కోసం రూ.పది లక్షలు చొప్పున దళిత బంధు అమలు చేస్తున్నారని వివరించారు.
తుకారాంగేట్ వద్ద రైల్వే అండర్ వంతెన ప్రారంభం ఇదీ చదవండి:శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసు.. రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు