KTR Comments on Hyderabad: నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నగర పరిధిలో 50 చెరువుల పునరుద్ధరణను కార్పొరేట్ కంపెనీలు దత్తత తీసుకున్నాయి. ఇందులో భాగంగా సీఎస్‌ఆర్ ఫండ్ కింద అభివృద్ది చేసిన ఖాజాగూడ పెద్ద చెరువును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు ఒప్పంద పత్రాలను మంత్రి అందజేశారు.
చెరువుల అభివృద్ధి కోసం రూ.కోటి..:ఈ సందర్భంగాహైదరాబాద్ నగరం చాలా అభివృద్ది చెందిందని విదేశీయులు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని 50 చెరువులను అభివృద్ది చేస్తామని పెద్ద కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. చెరువుల అభివృద్ది కోసం కంపెనీలు రూ.కోటి ఖర్చు పెడుతున్నాయని మంత్రి తెలిపారు.
మెట్రోను విస్తరిస్తాం..:ఈ క్రమంలోనే నగరంలో 200 ఎకరాల్లోఫాక్స్ కాన్ యూనిట్ పెడుతున్నారని కేటీఆర్ వెల్లడించారు.ఫాక్స్ కాన్ కంపెనీ వల్ల 30 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. గతేడాదిలో ఐటీలో లక్షా 50 వేల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని కోరితే.. ఆ ఏరియాల్లో వీలు కాదంటూ సమాచారం వచ్చిందన్నారు. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.