గ్రేటర్ హైదరాబాద్‌లో మెరుగైన జీవన ప్రమాణాల పెంపునకు గానూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జనాభాకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో రూ.67.76 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు లింక్ రోడ్లను ప్రారంభించారు. నందిహిల్స్ రోడ్ నం-45 వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
చరిత్రలో మరెప్పుడూ లేనివిధంగా
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా మరెప్పుడూ లేనివిధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, రహదారుల నిర్మాణం, జంక్షన్ల సుందరీకరణ తదితర పనులను చేపట్టామని మంత్రి తెలిపారు. వీటిలో రూ.6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.313 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం, సమర్థ రహదారుల నిర్వహణ కార్యక్రమం కింద రూ.1,800 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్వహణ పనులను చేపట్టామని వివరించారు.
అత్యంత వేగంగా
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. ఈ నగరాన్ని అభివృద్ధి చేపట్టడానికి శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళికలు రూపొందించాం. మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ను మేసర్స్ సంస్థ ప్రకటించింది. మరో ప్రముఖ సంస్థ జేఎల్ఎల్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని ప్రకటించింది. నగరంలోని రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.313 కోట్లతో 137 లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలన సాధ్యం. నగరంలో మరెక్కడైనా లింక్ రోడ్ల అభివృద్ధికి అవకాశాలు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వండి.