KTR Review Of old City Development Works: ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నలుమూలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ విధానమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ సహా పాతబస్తీ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం సభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సహా అధికారులు పాల్గొన్నారు. భాగ్యనగర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి రోజు నుంచి పాటుపడుతూ వస్తోందన్నారు.
పాతబస్తీ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఈ సమావేశంలో మంత్రికి అందజేశారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో ఇప్పటికే రహదారుల్ని బలోపేతం చేశామని.. ఫ్లై-ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని కేటీఆర్ చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పాతబస్తీలో రోడ్డు విస్తరణ కొంత సవాల్‌తో కూడుకుందని తెలిపారు. రోడ్డు వైడనింగ్ తప్పనిసరైన ప్రాంతాల్లో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.