Minister KTR letter to Central Govt: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో రైల్ విస్తరణకు హైదరాబాద్ నగరానికి అర్హత లేదని చెప్పడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి.. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీకి లేఖ రాశారు.
చిన్న పట్టణాలకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులను కేటాయించింది: దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరం హైదరాబాద్ అని, ఇక్కడ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందన్న వాదన అర్థరహితమవని తెలిపారు. కేంద్రం తమకు అనుకూలమైన నగరాలకు మెట్రో రైల్ ప్రాజెక్టులు కేటాయిస్తుందని మంత్రి ఎద్దేవా చేశారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై నగరాలతోపాటు లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి చిన్న పట్టణాలకు కూడా కేంద్రం మెట్రో ప్రాజెక్టులను కేటాయించిందని గుర్తు చేశారు.
కేంద్రం పక్షపాత దృక్పథంతో ఆలోచిస్తుంది: అర్హత లేని పట్టణాలు, రాష్ట్రాలకు ప్రాజెక్టులను కట్టబెడుతూ తెలంగాణకు మాత్రం కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం పట్ల కేంద్ర ప్రభుత్వం పక్షపాత దృక్పథంతో ఆలోచిస్తుందన్నారు. మెట్రో రైలు రెండో దశకు అవసరమైన అన్నిరకాల సమాచారాన్ని కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖకు అందించామని, దీనికి సంబంధించి మరోసారి కూడా అందజేస్తామని లేఖలో వివరించారు. మంత్రి హరదీప్ సింగ్ పూరిని వ్యక్తిగతంగా కలిసేందుకు అనేక సార్లు ప్రయత్నించని మంత్రి పేర్కొన్నారు. మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతల నేపథ్యంలో కేంద్రం ఆమోదం తెలపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Hyderabad Metro Project: హైదరాబాద్ నగరం నుంచి శరవేగంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో శంకుస్థాపన విషయం తెలిసిందే. అయితే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ కలిపే ఈ ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ కూడలిలోని రెండు ఫ్లై ఓవర్లను దాటుకుని నేరుగా.. కాజాగూడ చెరువు పక్కగా ఎలైన్‌మెంట్ వెళ్లనుంది. కాజాగూడ నుంచి కుడివైపు తిరిగి నానక్‌రాంగూడ కూడలి, అక్కడి నుంచి ఓఆర్‌ఆర్ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా జీఎంఆర్ సమన్వయంతో దీని ఎలైన్‌మెంట్ రూపొందించారు.
ఇవీ చదవండి: