KTR In Assembly: రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల ప్రకటనపై మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సుమారు 90 వేల ఉద్యోగాలు ప్రకటన చేయడం చరిత్రగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సైదిరెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. తమ నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసేందుకు మందుకురావడంపై ప్రశంసించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ముందుకురావాలని కోరారు. ప్రభుత్వం తరఫున సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
లక్ష మందికి చేనేత బీమా..
తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత అక్టోబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అభివృద్ధిపై నివేదిక విడుదల చేసినట్లు చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి దిశగా కొన్ని రంగాలను ఎంచుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అనేక పార్కులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. వరంగల్, సిరిసిల్ల సహా పలు చోట్ల ఏర్పాటుచేసిన టెక్స్టైల్ పార్క్‌లకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరినా వారు.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అంటే ఇదేనా అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత రంగానికి తెరాస ప్రభుత్వం చేయూతనిచ్చిన విధంగా.. ఎవరూ అండగా నిలవలేదని స్పష్టం చేశారు. త్వరలో లక్ష మంది చేనేత కార్మికులకు చేనేత బీమా కార్యక్రమానికి శ్రీకారం చుడతామని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్.. 'వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్'..
దేశంలో సుమారు 35 నుంచి 40 శాతం ఫార్మా ప్రొడక్ట్స్ కేవలం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని కేటీఆర్ చెప్పారు. లైఫ్‌సైన్స్ రంగంలో హైదరాబాద్ మొదటి వరుసలో ఉందన్నారు. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా అవతరించిందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ హైదరాబాద్‌లో పెడుతున్నామన్న మంత్రి.. దానికి కొందరు అడ్డుతగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆరోపణలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డుపడినా.. పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకెళ్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీనోమ్ వ్యాలీని మరో 200 ఎకరాలు విస్తరిస్తామని చెప్పారు.
ట్రాక్టర్ల నుంచి హెలికాప్టర్ వరకు...