ప్రజా సంక్షేమంపై ప్రధాని నరేంద్ర మోదీ విధానమేమిటో దేశ ప్రజలకు స్పష్టం చేసి చర్చ పెట్టాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారో లేదో ప్రధాని చెప్పాలన్నారు. పేదలకు, రైతులకు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలపై భాజపా వైఖరి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి వచ్చే ఎన్నికలకు వెళ్తారా? అని ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడానికి పార్లమెంట్‌లో చట్టం, రాజ్యాంగ సవరణ చేస్తారా? అనే విషయాన్ని దేశ ప్రజలకు తెలపాలన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశాక జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో.. పేదల సంక్షేమ పథకాలపై మోదీ తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. తన దృష్టిలో ఏది ఉచితమో? ఏది అనుచితమో ప్రధాని దేశ ప్రజలకు వెల్లడిస్తారని ఆశిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ సూటి ప్రశ్నలు - మంత్రి కేటీఆర్ ఫైర్
Minister ktr fires on pm modi ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాకులను కొట్టి గద్దలకు వేయటమే మోదీ విధానమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పేదల సంక్షేమ పథకాలపై మోదీకి ఎందుకంత అక్కసని పేర్కొన్నారు.
పేదల సంక్షేమ పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీకి అక్కసు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. పేదలకు ఇస్తే ఉచితాలు.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? అన్న కేటీఆర్.. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోదీ విధానమా? అని నిలదీశారు. రైతులకు రుణమాఫీ చేదు.. కార్పొరేట్ రుణమాఫీ ముద్దా? అని అన్నారు. ఓ వైపు నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుతూ.. కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రధానికి దేశ సంపదను పెంచే తెలివి.. పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే మనసూ లేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల పాలనలో బడా బాబులకు, రైతన్నకు మాఫీ చేసిన రుణాలు ఎన్నని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఓ వైపు పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేసిన కేంద్ర సర్కార్.. మరోవైపు పేదల ప్రజల నోటికాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించింది. సుమారు రూ.80లక్షల కోట్లు అప్పు తెచ్చిన మోదీ ప్రభుత్వం ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, జాతీయ స్థాయి నిర్మాణం కానీ చేశారా? పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చారా?’’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవీ చూడండి: