24 Hours Free Current Controversy between BJP and BRS : కాంగ్రెస్ పార్టీ రైతులను చంపుకుతినే రాబందని మరోసారి తేలిపోయిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ ప్రకటన.. ఆ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ రద్దు చేసి.. 3 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ఠ అని కేటీఆర్ మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఆపేసి అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణమన్నారు. ధరణి రద్దు.. రైతుబంధు వద్దూ అంటూ ఇప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా ఉచిత కరెంట్‌ను ఎత్తేస్తామన్న తన క్రూరమైన ఆలోచనను బయట పెట్టుకుందన్నారు. ఉచిత విద్యుత్‌కు ఉరి వేసేందుకు గాంధీభవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని.. తెలంగాణ రైతాంగానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.
24 Hours Free Current Controversy in Telangana : కాంగ్రెస్ కాలంలో రైతులు అనుభవించిన కష్టాలు, అనుభవించిన బాధలను తెలంగాణ ఎన్నటికీ మరచిపోదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కాలంలో కరువులు.. కన్నీళ్లు.. చీకట్లు.. అప్పులు.. ఆత్మహత్యలతో అన్నదాతలు అరిగోస పడ్డారన్నారు. విద్యుత్ కోతలతో చాలీచాలని 3 గంటల నాసిరకం కరెంట్‌తో రైతులు నరకం అనుభవించారని.. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో ఎండిన పంటలు.. రైతుల ధర్నాలు.. సబ్ స్టేషన్లపై దాడులతో పరిస్థితులు దారుణంగా ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి దుర్భరమైన పరిస్థితులు గత 9 ఏళ్లుగా మారిపోయాయన్నారు.
Free Power Cancel Controversy : అర్ధరాత్రి మోటార్లు పెట్టడానికి పోయి పాములు కుట్టి.. కరెంట్ షాకులు కొట్టి మృత్యువాతపడిన రైతులు కాంగ్రెస్ పాలన పరిస్థితులను తలచుకునేందుకు కూడా సిద్ధంగా లేరని కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఒక్కటే కాదని.. నాడు కాంగ్రెస్ హయాంలో ఎరువులను పోలీస్‌స్టేషన్‌లలో పెట్టి అమ్మే దుస్థితిఉండేదని.. కిలోమీటర్ల దూరం క్యూలైన్లలో చెప్పులు.. లాఠీఛార్జీల దృశ్యాలే కనిపించేవన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు దొరికింది కల్తీ విత్తనాలు.. కల్తీ పురుగు మందులేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని రక్షించుకోవడానికి.. వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
మెడపై కత్తి పెట్టినా లొంగలేదు..: సాగుకు విద్యుత్ ప్రాణావసరమని గుర్తించి.. విద్యుత్ రంగంపై రూ.వేల కోట్లు ఖర్చు చేసి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిందన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ.. ఇతర ప్రాజెక్టులతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి 27 లక్షల బోరుబావుల కింద అన్నదాతలు రెండు పంటలు పండించుకొని సంతోషంగా ఉన్నారని.. రైతు పచ్చగా ఉంటే చూసి కళ్లు మండిన కాంగ్రెస్ శక్తులు నిరంతరం ఏవో కుట్రలు చేస్తూనే ఉన్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఉచిత విద్యుత్‌ను ఎత్తి వేసి మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపై కత్తిపెట్టినా.. ప్రభుత్వం లొంగిపోలేదన్నారు. 24 గంటల ఉచిత కరెంట్‌ను కాపాడుకోవడానికి ఏకంగా రూ.30 వేల కోట్లను ప్రభుత్వం వదులుకున్నది తప్ప.. రైతుల ప్రయోజనాలపై రాజీపడలేదని స్పష్టం చేశారు.