Political Heat in Telangana : మరో ఐదు నెలల్లో ఎన్నికలు రానుండటంతో పార్టీల విమర్శలు-ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణిలో లోపాలను ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటూ... కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత తన పాదయాత్రలో ధరణి తీరుపై విమర్శలు గుప్పించగా... పీసీసీ అధ్యక్షుడు సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
KTR fires on Revanthreddy Comments : ధరణిలో అవకతవకలపై త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిన్న స్పష్టం చేశారు. రేవంత్ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి కేటీఆర్... భూదందాలు, కబ్జాలు చేసేవాళ్లకు ధరణి నచ్చట్లేదన్నారు. ధరణితో చేకూరిన ప్రయోజనాలను తామూ పవర్ ప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు. ఇలా... అధికార, ప్రతిపక్ష పార్టీలు ధరణి కేంద్రంగా చేస్తున్న రాజకీయం సవాళ్లకు దారితీస్తోంది. ధరణిపై రేవంత్ విమర్శలు హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు. జాతీయ కూటములు అనేది మాటల్లోనే ఉంటుంది.. చేతల్లో కుదరదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
'వేలకోట్ల అవినీతి అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణ గాంధీభవన్‌లో గాడ్సే ఉన్నాడు. రేవంత్ ఏ ఒక్క రోజూ మోదీని విమర్శించరు. రేవంత్ రెడ్డి.. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మనిషి. భూదందాలు, కబ్జాలు చేసేవాళ్లకు ధరణి నచ్చట్లేదు. ధరణి ఎంత సఫలం అయిందనేది ప్రజలకు మేము వివరిస్తాం. దుబ్బాక, మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయి. హుజూరాబాద్, సాగర్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయి. రాహుల్ గాంధీని నాయకుడిగా ఎవరూ గురించట్లేదు. రాహుల్ ఏ హోదాలో రూ.4వేల పింఛన్ హామీ ప్రకటించారు?.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి